ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. టీడీపీ, జనసేన, పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని వేగవంతంగా చేసింది. కానీ ఒక్క బీజేపీ మాత్రం సుప్తావస్తలోనే ఉంది. దీంతో అసలు బీజేపీ ప్లాన్ ఎంటనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. టీడీపీ జనసేనపార్టీలతో కలిసి పోటీ చేయాలా ? వద్దా ? అనే దానిపై కమలనాథులు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో పొత్తుపై చర్చలు జరిపినప్పటికీ అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో పొత్తుపై క్లారిటీ ఇవ్వలేక అటు ప్రజల్లోకి వెళ్లలేక రాష్ట్ర బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలకు డిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 17న రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ రావాలని అధిష్టానం కబురు పెట్టడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెల 17న జరిగే బీజేపీ జాతీయ సదస్సుకు ఏపీలోని బీజేపీ ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరితో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలతో బీజేపీ అధిష్టానం ఏం చర్చలు జరపనుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా పొత్తు అంశం, సీట్ల సర్దుబాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత టీడీపీ, జనసేన కూటమితో కలవడంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్ర నేతలలో కూడా మెజారిటీ సభ్యులు టీడీపీ జనసేనతో కలవడంపై సుముఖంగానే ఉన్నారు. అయితే ఈసారి కూటమిలో బీజేపీకి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి పొత్తు ఆధారపడి ఉంటుందని కొందరి అభిప్రాయం. మరి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గందరగోళంగా మారిన పొత్తు అంశంపై బీజేపీ అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరమే.
Also Read:పనస పండ్లు ఎక్కువగా తింటున్నారా?