మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెద్ద తిరుగుబాటు జరగబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. శివసేన (ఉద్ధవ్) వర్గానికి చెందిన ఏడుగురు ఎంపీలు.. ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోకి మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూన్ 7న న్యూఢిల్లీలో ఏకనాథ్ షిండే మరియు ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన పలువురు ఎంపీల మధ్య ఒక రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షిండే వర్గం ఆ ఎంపీల ముందు ఒక రాజకీయ ప్రతిపాదనను ఉంచినట్లు తెలుస్తోంది. ఇది యూబీటీ (UBT) క్యాంప్‌లో మరో చీలిక రాబోతోందనే ప్రచారానికి కారణమైంది.
రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగవచ్చనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. థాక్రే వర్గానికి చెందిన ఒక ఎంపీకి కేంద్ర మంత్రిమండలిలో చోటు కల్పిస్తామని ఆఫర్ ఇచ్చారని మిగిలిన వారికి పార్టీలో..ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
గత ఆరు నెలలుగా ఏకనాథ్ షిండే…లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్ షిండేలు పలువురు యూబీటీ సేన ఎంపీలతో నిరంతరం టచ్‌లో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఢిల్లీ నివాసంలో జరిగిన సమావేశాలకు కూడా థాక్రే క్యాంప్ ఎంపీలు హాజరైనట్లు తెలుస్తోంది.
Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్
ప్రస్తుతం శివసేన (UBT) కి ఉన్న 9 మంది లోక్‌సభ ఎంపీలలో ముంబైకి చెందిన ఇద్దరు ఎంపీలు మినహా మిగిలిన ఏడుగురు ఎంపీలు షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఏడుగురు ఎంపీలే ఇటీవల ఢిల్లీలో షిండేతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారని అంటున్నారు.అయితే అటు ఉద్ధవ్ థాక్రే క్యాంప్ నుండి కానీ ఇటు షిండే వర్గం నుండి కానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.

