కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌..!

205
Rahul Gandhi
- Advertisement -

ఓ వైపు సార్వత్రిక ఎన్నికల నగారా మోగడం మరోవైపు పార్టీ ఫిరాయింపులతో తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. రాహుల్ గాంధీ సభ,పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన రెండురోజులకే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా ఇందులో పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉండటం పెద్ద ఎదురుదెబ్బ.

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు సీనియర్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా సబితా వెనక్కి తగ్గలేదు. పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా భరించామని ఇకపై అలాంటి ప్రసక్తే ఉండదని వారికి సబితా తేల్చిచెప్పారట. కార్తీక్ రెడ్డికి చేవెళ్ల సీటు ఇస్తామని చెప్పి విశ్వేశ్వర్‌ రెడ్డిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఆమె నిలదీసిందట. దీంతో చేసేదేమీ లేక వారు వెనుదిరగగా రాహుల్ చేవెళ్ల సభ తర్వాత సబితా పార్టీ మారుతుండటం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్రం సక్కు,రేగా కాంతారావు,చిరుమర్తి లింగయ్య,హరిప్రియ నాయక్‌ టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించగా సబితతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కారెక్కనున్నట్లు తెలుస్తోంది.

వైఎస్ హయాంలో చెవేళ్ల చెల్లెమ్మగా వెలుగు వెలిగింది సబిత. వైఎస్ మరణం తర్వాత రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన సబితా 2014 జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కార్తీక్‌ కోసం తన సీటును త్యాగం చేసింది. ఒక కుటుంబం నుండి ఒక్కరే పోటీచేయాలనే నిబంధనతో మహేశ్వరం సీటును వదులుకుని కార్తీక్‌ రెడ్డిని చేవెళ్ల ఎంపీగా బరిలోకి దింపింది. అయితే కార్తీక్‌కు ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు.

ఇక 2018 ఎన్నికల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. రాజేంద్రనగర్‌ నుండి బరిలోకి దిగాలనుకున్న కార్తీక్‌ చాలాకాలంగా గ్రౌండ్ వ‌ర్క్ కూడా చేసుకున్నారు. అయితే, మ‌ళ్లీ కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధ‌న‌తో కార్తీక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. ఓ ద‌శ‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి కార్తీక్ మొగ్గు చూపారు. కానీ చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ద‌క్కుతుందనే హామీతో వెనక్కితగ్గారు.

అయితే తీరా ఎన్నికల ముందు సీన్ రీవర్సైంది. చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఆయనకే సీటు కన్ఫామ్ కావడంతో కార్తీక్ ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో సబిత,కార్తీక్ ఇద్దరు అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న సబితా కారెక్కెందుకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

- Advertisement -