సాయుధ దళాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకోవడానికి తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనలు చేపట్టారు. పలు చోట్ల నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది.
ఇక ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై రిటైర్డ్ మేజర్ జనరల్, కార్గిల్ యుద్ధ వీరుడు జీడీ బక్షీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంతో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని తెలిపారు.
నాలుగేండ్లు సైన్యంలో శిక్షణ పొంది, తుది పరీక్షలో ఎంపిక కానటువంటి అభ్యర్థులు.. ఆ తర్వాత ఉగ్రవాద, చొరబాటు గ్రూపుల్లో చేరబోరని గ్యారంటీ ఏంటి? అని ప్రశ్నించారు. శిక్షణ కాలంలో దేశ సాయుధ దళాల రహస్యాలు తెలిసిన వారిపై కేంద్రం నిఘాను కొనసాగించగలదా? కొనసాగించే ప్రతిపాదన ఉంటే.. ఎంతమందిపై అని నిఘా పెట్టగలరు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
దేశ భద్రతకు సంబంధించిన ఆర్మీలో నాలుగేండ్ల పరిమిత కాలంతో ఓ స్కీమ్‌ను తీసుకురావడం ఎంతో ప్రమాదకరమైన చర్య అని అభిప్రాయపడ్డారు. డబ్బుల కోసం శక్తివంతమైన సాయుధ దళాలను నాశనం చేయవద్దని సూచించారు.
సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో ‘అగ్నిపథ్’ స్కీమ్‌లో కేంద్రం స్వల్ప సవరణ చేసింది. అభ్యర్థుల గరిష్ఠ వయసును 21 ఏండ్ల నుంచి 23 ఏండ్లకు పెంచింది. అయితే కేంద్రం వివరణ ఇచ్చిన.. విమర్శలు మాత్రం ఆగడం లేదు.