అంగన్ వాడీలలో నిర్లక్యానికి తావివ్వకూడదుః మంత్రి సత్యవతి

341
satyavathi
- Advertisement -

పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్ వాడీ కేంద్రాలలో, మినీ అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోపు వండి, వేడి, వేడిగా తల్లులకు, పిల్లలకు అందించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళా – శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి దివ్య గారితో తో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు హైదరాబాద్, డిఎస్ఎస్ భవన్ లో నేడు సమీక్ష చేశారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఇప్పటికే ఏయే సంస్థలు మూసివేయాలి, వేటిని పనిచేయించాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అంగన్ వాడీ కేంద్రాలు, మినీ అంగన్ వాడీలు కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ సెలవులపై ఆదేశాలు ఇచ్చే వరకు పని చేయాలని చెప్పారు. అయితే కరోనా లక్షణాలున్న వారు కేంద్రాలకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాంటి వారిని గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.అంతే కాకుండా గ్రామాల్లోకి విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారి సమాచారం కూడా ఉన్నతాధికారులకు అంగన్ వాడీ సూపర్ వైజర్లు, టీచర్లు, ఆయాలు అందించాలన్నారు.

గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన పరిశుభ్రత చర్యలు చేపట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు గుమి కూడకుండా ఉపాధ్యాయులు వెంట ఉండి పర్యవేక్షించాలన్నారు. తల్లిదండ్రులు కూడా అత్యవసరమైతే తప్ప రాకూడదని సమాచారం ఇవ్వాలన్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శానిటైజేషన్ చేయాలన్నారు. మహబూబాబాద్, ములుగు, వరంగల్ అర్భన్ కలెక్టర్లతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ మూడు జిల్లాలకు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై గట్టి నిఘా ఉంచి క్వారెంటైన్ చేయాలన్నారు. అదేవిధంగా పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత వరకు సమావేశాలు, సభలు లేకుండా చూడాలని ఆయా జిల్లాల ఎప్పీలకు ఆదేశాలిచ్చారు.

- Advertisement -