ఎవరికైనా అకస్మాత్తుగా ఊహించని బాధ కలిగించే విషయం తెలిస్తే ఆ బాధతో కుమిలిపోతుంటారు. చేసే పనిమీద శ్రద్ధ ఉండదు. ఏ పని చేసినా విఫలం అవుతుంటారు. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు ఆండ్రూ టై మాత్రం బాధలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాన్నమ్మ చనిపోయింది అని తెలిసినా.. దుఃఖాన్ని దిగమింగుకుని ఆటపట్ల శ్రద్ధ పెట్టి ఆడాడు. మంగళవారం ఉందయం తన నాన్నమ్మ చనిపోయినట్లు కబురందింది. అయినా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడి 4 వికెట్లు తీసి 34 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా టై నిలిచాడు.
మ్యాచ్ అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా టై పర్పుల్ క్యాప్ ను అందుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన నానమ్మ చనిపోయిన విషయాన్నిఈ సందర్భంగా టై చెప్పాడు. ఈ మ్యాచ్ లో నేను చేసిన గొప్ప ప్రదర్శన ఆమెతో నా కుటుంబసభ్యులకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఈ మ్యాచ్ లో టై చెలరేగి నాలుగు వికెట్లు తీయడంతో భారీ స్కోర్ దిశగా వెళ్తున్న రాజస్థాన్ కి బ్రేక్ పడింది. పంజాబ్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 94 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ చెలరేగినప్పటికీ 15 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది.