అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాల ముప్పును తిప్పికొట్టేందుకు భారతదేశం అత్యంత పటిష్టమైన పోరాటాన్ని సాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘డ్రగ్స్ రహిత భారత్’ సాధనే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తోందని, ఈ మహమ్మారిని దేశం నుండి పూర్తిగా నిర్మూలించే వరకు విశ్రమించబోమని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందని వివరించారు. ఇందులో భాగంగా సరిహద్దుల గుండా జరిగే అక్రమ రవాణాను అడ్డుకోవడం, దేశీయంగా నిఘాను పటిష్టం చేయడం మరియు అంతర్జాతీయ ఏజెన్సీలతో సమన్వయాన్ని పెంచుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరాను పూర్తిగా తుడిచిపెట్టడానికి భద్రతా దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రాత్రింబగళ్లు శ్రమిస్తున్నాయని…పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం మరియు నిందితుల అరెస్టులు దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేసిన హోంమంత్రి…., కేవలం చట్టపరమైన చర్యల ద్వారానే కాకుండా సామాజిక అవగాహన ద్వారానే దీనికి శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. సమాజంలో ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో యువతకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
Also Read:మరింత వేగంగా చాట్‌జీపీటీ!

