కాంగ్రెస్ టార్గెట్ కుమారస్వామి!

4
- Advertisement -

కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ, జెడి(ఎస్) నాయకత్వమే లక్ష్యంగా సరికొత్త పోస్టర్ల ఉద్యమాన్ని ప్రారంభించి రాజకీయ వేడిని పెంచింది. కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి …ఆయన భార్య అనితా కుమారస్వామి, కుమారుడు నిఖిల్ కుమారస్వామిలను ఉద్దేశించి ప్రతిపాదిత బిడాది ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్, వారి భూములు మరియు ఆర్థిక ఆస్తులపై కాంగ్రెస్ పలు ప్రశ్నలను సంధించింది.

రైతుల సంక్షేమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆపాలని, వాస్తవాల ఆధారంగా చర్చకు రావాలని డిమాండ్ చేసింది. బిడాది టౌన్‌షిప్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల హక్కులను కాపాడటానికి, వారికి సరైన పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

ఈ వివాదంలో కుమారస్వామి కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. నిఖిల్ కుమారస్వామి ఆస్తులు, సంపాదనపై బహిరంగంగా వస్తున్న అనుమానాలకు స్పష్టమైన ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని కోరింది. అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కుమారస్వామి చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించడానికి తగిన ఆధారాలు ఉంటే వాటిని దర్యాప్తు సంస్థలకు సమర్పించాలని సవాలు విసిరింది. ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఖాయం అని కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అంతటి తీవ్రమైన ఆరోపణకు గల చట్టపరమైన, వాస్తవిక ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేసింది.

Also Read:సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు

కుమారస్వామి కుటుంబానికి చెందిన భూముల కొనుగోళ్లు, నిధుల మూలాలపై పారదర్శకత కోసం ఒక ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దాదాపు 41 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు చెబుతున్న 44 ఎకరాల భూమికి సంబంధించిన నిధుల వనరులు, అధికారిక రికార్డులను బహిరంగపరచాలని ప్రశ్నించింది. అనితా కుమారస్వామి పేరిట ఉన్న భూములపై అలాగే పాఠశాల నిర్మాణం కోసం భూమిని విరాళంగా ఇస్తానని నిఖిల్ కుమారస్వామి చేసిన ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ కుటుంబంగా ఇతరులపై ఆరోపణలు చేసే ముందు తమ స్వంత ఆస్తులు మరియు భూ లావాదేవీలలో పూర్తి పారదర్శకతను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని కాంగ్రెస్ నిలదీసింది. కర్ణాటక ప్రజలకు నిరాధారమైన ఆరోపణల రాజకీయం కాకుండా, నిజాలు మరియు జవాబుదారీతనంతో కూడిన రాజకీయం కావాలని కాంగ్రెస్ పేర్కొంది.

- Advertisement -