కథలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలకు కూడా పెద్ద విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ నమ్మకంతోనే కొత్త ఆలోచనలతో యువతరాన్ని ఆకట్టుకునే కథా కథనాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అమీర్పేటలో. సాఫ్ట్‌వేర్ రంగానికి, సినిమా రంగానికి ఉన్న సంబంధాలు, అమీర్‌పేటలోని యువత చేసే తప్పొప్పులు గురించి చెబుతు వాటి పరిష్కారాల గురించి తెరకెక్కిన అమీర్ పేటలో ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా
చూద్దాం.
కథః
వివేక్ (శ్రీ), బిర్యాని బిట్టు (తిలక్), లింగు (సాయి), వెంకట్రావు (రాజు).. వీళ్లంతా తమ ఊరినీ, తల్లితండ్రుల్ని వదిలి ఉద్యోగాల వేటలో అమీర్ పేట వస్తారు. ఇక్కడికి వచ్చింది ఉద్యోగం కోసమే అయినా వేసే వేషాలు వేరు. వివేక్‌కి సినిమా హీరో అవ్వాలన్నది కల. లింగు ఓ అమ్మాయిని పటాయించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. బిట్టు బిర్యానీలు తింటూ, బీర్లు తాగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. అలా ఒకొక్కరిదీ ఒక్కో దారి. వివేక్‌కి వెన్నెల (అశ్వని) పరిచయం అవుతుంది. డేటింగ్ పేరుతో దగ్గరై.. వెన్నెలతో ‘ఆ అనుభవం’ రుచి చూద్దామనుకొంటాడు వివేక్. వెన్నెల మనస్తత్వం పూర్తిగా వేరు. వివేక్‌ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకొంటుంది. వెన్నెల వల్ల వివేక్… వివేక్ వల్ల
మిత్రబృందం ఎలా మారారు? వీళ్లంతా సమాజానికి ఏం చేశారు? అనేదే కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ వినోదం,సెకండాఫ్,సినిమా ద్వారా ఇచ్చే సందేశం. నటీనటులంతా కొత్తవారే. అంతా తమ పాత్రల్లో రాణించారు. సీనియర్ నటులు లేని కొరత కనిపించింది. అయితే ఇలాంటి కథలు త్వరగా రిజిస్టర్ అవ్వాలంటే కొత్తవాళ్లే నయమేమో. దర్శకుడిగా, కథానాయకుడిగా రెండు బాధ్యతల్నీ బాగానే మోశాడు శ్రీ. హీరో స్నేహితుల బృందం కూడా చక్కగానే నటించారు. సంభాషణలు అక్కడక్కడా ఆకట్టుకొంటాయి. అమీర్ పేటలో అనే టైటిల్ గీతంతో పాటు, యువతరానికి సందేశాన్ని ఇచ్చే స్ఫూర్తి గీతం
ఆకట్టుకొంటాయి.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ మేకింగ్, నటీనటులంతా కొత్తవారే. ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీసినట్టుగా ఉన్నాయి. హీరోనే దర్శకుడు, నిర్మాత కావడంతో ఆయన్నేం అనలేం. శ్రీ ఏం చేసినా… ఏం చేయకపోయినా `సినిమా అంతా ఆయనది.. ఆయనిష్టం` అంటూ సర్దుకుపోవాల్సిందే. హీరోయిన్ పనీ పాటా లేకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. సీరియస్ సీన్ అయినా ఆమె మొహంలో నవ్వు చెరగలేదు. మిగిలిన నటీనటుల నటన, వాళ్ల ఎంపిక షార్ట్ ఫిల్మ్స్ కాస్టింగ్, వాళ్ల యాక్టింగ్ కంటే పది అడుగులు వెనకే ఉంది. కాస్టింగ్ పరంగా, టేకింగ్‌పరంగా జాగ్రత్తలు తీసుకొంటే.. ఈ సినిమా అవుట్ పుట్ ఇంకో స్థాయిలో ఉండేది.
సాంకేతిక విభాగం:
తొలి సినిమా అయినా తనకున్న వనరులతో పరావాలేదనిపించాడు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో పక్కా క్లారిటీతో గ్రిప్పింగ్‌గా తెరపై చూపించలేకపోయాడు. ఎందుకంటే ఫస్టాఫ్‌లో యూత్ చుట్టూ తిరిగే కథ, సెకండాఫ్ వచ్చేసరికి అనాథ పిల్లలు, వారి పోషణ వంటి విషయాలను చూపించాడు. మురళి లియోన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అమీర్ పేటలో..టైటిల్ సాంగ్, పిల్లలపై వచ్చే సాంగ్ సహా ట్యూన్స్ ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కిరణ్ సినిమాటోగ్రఫీ బాగాలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు:
యూత్ను అలరించే ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే నేటి యువతరం చెడు స్నేహాం వల్ల ఎలాంటి తప్పటడుగులు వేస్తోందో చూపించే ప్రయత్నమే అమీర్ పేటలో. సినిమా ద్వారా ఇచ్చే సందేశం, కామెడీ,సెకండాఫ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా మేకింగ్, నటీనటులంతా కొత్తవారే కావటం సినిమాకు మైనస్ పాయింట్. మొత్తంగా ఓ మంచి స్నేహితుడు దొరికితే అప్పటి వరకు చెడ్డ దారిలో నడిచిన వారుకూడా ఎలా మంచి మార్గంలోకి వస్తారో చూపించే ప్రయత్నమే అమీర్ పేటలో. మొత్తంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే సందేశాత్మక చిత్రం.
విడుదల తేదీ:16/12/16
రేటింగ్: 2.5/5
నటీనటులు: శ్రీ, అశ్విని, ఈష, రాజు, తిలక్
సంగీతం: మురళి లియోన్
నిర్మాతః మహేష్ మందలపు
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ