ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోన్న కరోనా….అమెరికాను అతలాకుతలం చేసింది. అమెరికాలో రోజుకు 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో అమెరికాలో 63,998 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 34,77,993కు చేరగా కరోనాతో 1,38,234 మంది మృతిచెందారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాలిఫోర్నియాలో లాక్‌డౌప్ నిబంధనలను కఠినతరం చేయాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది.
కాలిఫోర్నియాలో ఇప్పటివరకు 3,30,000కు పైనే కరోనా కేసులు నమోదు కాగా మొత్తం 7,000 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే వ్యాపారాలు, బహిరంగ ప్రదేశాలపై ఆంక్షలను తిరిగి విధించింది. రెస్టారెంట్లు, బార్‌లు, థియేటర్లు, వినోద వేదికలు, జంతుప్రదర్శనశాలలు, మ్యూజియంలతో పాటు అన్ని ఇండోర్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.