హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా మరో కీర్తిని సొంతం చేసుకుంది. అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాన్ని హోమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అమెజాన్ కార్యాలయంలో మొక్కను నాటారు హోమంత్రి. ఈ క్యాంపస్ నుంచి కంపెనీ అంతర్జాతీయ కార్యకలాపాలను నిర్వహించనుంది.
2016 మార్చిలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్లలోనే సుమారు పది ఎకరాల స్థలంలో, 15 అంతస్థుల్లో ఈ కార్యాలయం నిర్మాణం పూర్తయింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది.
సుమారు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 10 లక్షల చదరపు అడుగులను కేవలం పార్కింగ్ స్థలానికే కేటాయించారు. ఈ భవన నిర్మాణానికి అమెజాన్ సంస్థ సుమారు రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టింది.
ఇప్పటికే అమెజాన్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద సుమారు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీన్నే 2020 చివరి నాటికి 5.8 లక్షల చదరపు అడుగులకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి.