బస్సుల కోసం ప్రయాణీకులు ఎదురు చూసే పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండేందుకై టి.ఎస్.ఆర్టీసీ ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లను క్రమంగా పెంచుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక సర్వీసుల్ని పెంచే దిశలో అధికార యంత్రాంగం కార్యాచరణ దిశగా వెళ్తోంది. ఆయా ప్రాంతాలలో బస్సులు లేక ప్రయాణీకులు అవస్థలు పడకూడదనే ఉద్ధేశంతో సాధ్యమైనంత వరకు బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
రవాణా శాఖా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, టి.ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, ఐ.ఎ.ఎస్ ప్రజా రవాణాను మరింత మెరుగుపరచడానికి గల అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. ప్రయాస లేని ప్రయాణం అందించే దిశలో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో బస్సుల రాకపోకల వివరాలను పరిశీలిస్తూ ఈ మేరకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
మరి, మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 73 శాతం బస్సుల్ని తిప్పగలిగారు. 4604 ఆర్టీసీ బస్సులు, 1952 అద్ధె బస్సులు అంటే మొత్తం 6556 బస్సులతో వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చగలిగారు. రోజు వారీ పద్ధతిలో 4604 మంది తాత్కాలిక డ్రైవర్స్, 6556 మంది తాత్కాలిక కండక్టర్స్, 5265 బస్సుల్లో టిమ్స్ ద్వారా, 772 బస్సుల్లో నేరుగా టిక్కెట్లను జారీ చేశారు.