రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతావాది అన్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. అనేక మంది బిడ్డలు వారు చేయని తప్పులకు మానసిక వికలాంగులుగా ఉన్నారన్నారు. నగరంలో నిర్వహించిన మానసిక వికలాంగుల సాంస్కృతిక సంబరాల కార్యక్రమానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ హాజరై, ప్రసంగించారు.
ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాధోడ్ మాట్లాడుతూ.. అన్ని అవయవాలు సరిగ్గా ఉండి, సమాజానికి హాని తలపెట్టే వారే అసలైన వికలాంగులని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో సంతోషం చూడాలని సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి అన్నారు. మానసిక వికలాంగులలో 18 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఎలాంటి మార్పు ఉండదు. 18 ఏళ్లు నిండిన తర్వాత వీరిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మానసిక వికలాంగులకు రూ. 3,016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి అన్నారు
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. మానసిక వికలాంగుల పరిస్థితి దయనీయంగా ఉంటుందని వారు జీవితాంతం వారి బాగోగుల కొరకు ఇతరులపై ఆధారపడవలసి ఉంటుందని అన్నారు. వారిని చేరదీసే స్వచ్ఛంద సేవా సంస్థల కృషి వెలకట్టలేనిదని.. ఈ సంస్థలు వారికి మానసిక ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. వీరిని పెంచడం వారి తల్లిదండ్రులకు చాలా కష్టంతో కూడుకున్న పని. జీవితకాలం వీరిని పసిపిల్లలుగా చూసుకోవాలి. 10,50,000 మంది దివ్యాంగులలో 54,000 మంది మానసిక వికలాంగులు ఉన్నారనీ, వీరి రక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది అని మంత్రి అన్నారు.