పవన్‌,జేడీ గెలుపుపై ఉత్కంఠ..!

440
pawan jd laxminarayana
- Advertisement -

తొలిదశ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓటేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడి ఓటేశారు. ఇక ఏపీలో పోలింగ్ దాదాపు 80 శాతానికి చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా జనసేన ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిందన్న చర్చ మొదలైంది.

జనసేన టాప్ లీడర్స్‌ పవన్ కల్యాణ్,సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గెలుస్తారా లేదా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ప్రజారాజ్యం స్ధాపించిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి,పాలకొల్లు రెండు చోట్ల పోటీచేయగా తిరుపతి ఒక్కస్ధానంలోనే గెలిచారు. ఇప్పుడు పవన్‌ కూడా గాజువాక,భీమవరం రెండు స్ధానాల నుండి పోటీచేశారు. ఈ రెండు స్థానాల్లో పవన్ గెలుస్తారా లేదా ఒక్కస్ధానంలో గెలుస్తారా అన్నదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

పవన్ బరిలో నిలిచిన గాజువాకలో పోలింగ్‌ సరళి ఉత్కంఠభరింతంగా సాగింది. టీడీపీ నుండి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి కూడా బలమైన పోటీనిచ్చారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ తరపున పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వయసురీత్యా ఇప్పుడు గెలవకపోతే మరో ఐదేళ్ల తరువాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లకు చెబుతూ వచ్చారు. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కు సౌమ్యుడిగా, కష్టపడి పనిచేసే వ్యక్తిగా, పలు సమస్యల్ని సమర్థంగా పరిష్కరించిన నేతగా గుర్తింపు పొందారు.ఈ నేపథ్యంలో పవన్‌కు వీరిద్దరి నుండి గట్టిపోటీ ఎదురైంది. టీడీపీకి పట్టుకున్న స్ధానాల్లో ఓటింగ్ శాతం పెరగడంతో పవన్ గెలుస్తారా లేదా అన్న చర్చమొదలైంది.

ఇక విశాఖ లోక్‌సభ బరిలో నిలిచిన జేడీ లక్ష్మీనారాయణది ఇదే పరిస్ధితి. విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ భారీగా నమోదైనట్టు పోలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

అయితే విశాఖ ఎంపీ పరిధిలోని గాజువాక నుండి బరిలో ఉన్న పవన్‌ మినహా మిగిలిన స్థానాల్లోనివారు బలహీనంగానే ఉన్నారు. వారు వ్యక్తిగతంగా పెద్దగా తెలిసినవారు కాకపోవడంతో అది లక్ష్మీనారాయణపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాలామంది భావించారు. కానీ భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో దానిపైనే ఆశలు పెట్టుకున్నారు జేడీ. మొత్తంగా జనసేన టాప్‌ లీడర్లు పవన్,జేడీ గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే మే 23 వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -