కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా వస్తుండటంతో ఎంసెట్ తో పాటు అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నీ రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. జీహెచ్ ఎంసీలో మరోసారి లాక్ డౌన్ పెట్టనున్నట్లు వార్తలు రావడంతో ఎంట్రెన్ పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది కోర్టు. జీహెచ్ ఎంసీలో లాక్ డౌన్ ఇంకా స్పష్టత రాలేదని ..క్యాబినెట్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని తెలిపారు అడ్వకేట్ జనరల్. ఈ నేపథ్యంలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది ఉన్నత విద్యామండలి. కాగా ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా జులై 31వరకు అన్ని కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం.