రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి కేవలం మద్యం సేవించి ఉన్నాడనే కారణంతో… ప్రమాదానికి అతనే బాధ్యుడంటూ క్లెయిమ్‌ను తిరస్కరించలేమని ఢిల్లీ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) స్పష్టం చేసింది. బాధితుడు మద్యం సేవించడం మాత్రమే అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడని నిరూపించలేదని ట్రిబ్యునల్ పేర్కొంది. 2018లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన సచిన్ ధావన్ అనే వ్యక్తికి ₹30.77 లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తూ ట్రిబ్యునల్ ఈ వ్యాఖ్యలు చేసింది.
బాధితుడి వైద్య నివేదిక (మెడికల్ రిపోర్ట్) ప్రకారం అతని శ్వాసలో మద్యం వాసన వచ్చినట్లు తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బాధితుడు ఎంత పరిమాణంలో మద్యం సేవించాడనే విషయాన్ని పోలీసులు నమోదు చేయలేదు. కేవలం ఈ కారణం చేతనే అతను అనుమతించదగిన పరిమితికి మించి మద్యం సేవించి మోటార్ సైకిల్ నడిపాడని నిర్ధారించలేమని ట్రిబ్యునల్ పేర్కొంది.
Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!
ఒక వ్యక్తి అనుమతించదగిన పరిమితిలో లేదా అంతకంటే ఎక్కువ మద్యం సేవించినప్పటికీ… అంతమాత్రాన మరొకరు తమ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి అతనిని ఢీకొట్టే హక్కు ఉండదు. బాధితుడు కేవలం మద్యం సేవించి ఉండటం అనేది అతని స్వయం తప్పిదాన్ని పూర్తిగా నిరూపించదు అని పేర్కొంది. ఈ తీర్పు భవిష్యత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల క్లెయిమ్ కేసులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కేవలం ఆల్కహాల్ వాసనను నెపంగా చూపి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను తిరస్కరించే కంపెనీలకు ఇది గట్టి హెచ్చరికగా నిలుస్తుంది.

