రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారం అంతు తేల్చేందుకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సెలవులను కూడా రద్దు చేసుకున్న అకున్ హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రి సిటీగా మార్చేందుకు తలమునకలయ్యారు. ఇప్పటికే సినీ ప్రముఖుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన ఆయన సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ ఎలా సరఫరా అవుతున్నాయో తెలిసిందని తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్‌ని డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేసింది. డ్రగ్స్ విచారణ ఉన్నపలంగా నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు కాల్ చేసి హెచ్చరికలు చేశారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. ఇంటర్నెట్ ద్వారా అగంతుకుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వారం రోజులుగా కూడా ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంట.
కెల్విన్ ముఠాకు నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలతో పాటు అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అకున్ సబర్వాల్ అంత స్థాయి ఉన్నతాధికారిని బెదిరించడాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో వారి ఆటకట్టించేందుకు పావులు కదుపుతున్నారు.
మరోవైపు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించిన సిట్ తమ విచారణను మరింత వేగవంతం చేశారు. హైదరాబాదులోని పబ్స్ లో వెస్ట్రన్ కల్చర్ విస్తృతంగా ఉందని గుర్తించారు. దీంతో దాని ప్రక్షాళనకు నడుం బిగించారు. హైదరాబాదులోని 16 పబ్ ల యజమానులకు నోటీసులు పంపారు. ఇవాళ పబ్ యజమానులతో సిట్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.