అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. అక్షయ తృతీయ నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.
అక్షయ తృతీయకు ఎంతో విశిష్టత ఉంది. మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది. పుణ్య కార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుందని తెలిపాడు. అందుకే అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.
అక్షయ తృతీయ నాడు ఎవరికైనా దానం చేస్తే భగవంతుడు వారికి వరాలనిస్తాడని నమ్మకం. ఇక ఏ కార్యక్రమైనా ప్రారంభించటానికైన అక్షయ తృతీయకు మించిన ముహూర్తం లేదంటారు.
ఇవాళ ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని బియ్యపు గింజలతో పూజిస్తారు. ఈ రోజు జ్ఞానసముపార్జన చేయాలనుకున్నా దానాలు చేసినా ఎంతో ఫలవంతం అవు తుంది. బియ్యం ఉప్పు నెయ్యి పంచదార కూరలు చింతపండు పండ్లు బట్టలు ఏది దానం చేసినా మంచిదే. అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం విశేషం గోమాతకు గోధుమలు పొట్టు బెల్లం అరటిపండు కలిపిన ఆహారాన్ని పెడితే లక్ష్మీదేవి అను గ్రహం లభిస్తుందని వేద పండిుతులు చెబుతున్నారు.పసుపు కుంకుమలు దానం చేస్తే మహిళలకు ఐదవతనం అంటే సౌభాగ్యవతిగా ఉంటారు. అన్నదానం ద్వారా సాక్షాత్తు దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుంది.
ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.