ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజుకొ కీలక మలుపు తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీని సమస్యలు సుడిగుండంల చుట్టుముడుతున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించారు.దీంతో అఖిలేష్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తండ్రి ములాయం తీరును తప్పు బట్టారు. మరోవైపు బాబాయ్ శివపాల్‌తో అబ్బాయి అఖిలేష్ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఇది ఇలా ఉండగా సీఎం అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘ జాతీయ సమాజ్‌వాదీ పార్టీ ‘లేదా ‘ప్రగతిశీల్ సమాజ్ వాద్ పార్టీ ‘పేరుతో వేరు కుంపటి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అఖిలేష్ సన్నిహిత వర్గాల సమాచారం. నవంబర్ 5న పార్టీ రజతోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే…3 నుంచి వికాస్’ రథయాత్ర ‘చేపట్టాలని నిర్ణయించారు. ఇవన్నీ చూస్తుంటే ఎస్పీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎస్పీ ముఖ్యనేతలతో శుక్రవారం జరిగిన సమావేశానికి అఖిలేష్ యాదవ్ గైర్హాజరయ్యారు. ఈ భేటీ పూర్తయ్యాక ఆ నాయకులతోనే సీఎం తన నివాసంలో వేరుగా సమావేశమై నవంబర్ 3నుంచి జరగనున్న ‘వికాస్ రథయాత్ర’ గురించి మాట్లాడారు. అఖిలేష్ కొత్తపార్టీ ప్రయత్నాలపై వార్తల నేపథ్యంలో …ఎస్పీ పార్టీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపే అంతా పూర్తి చేసి మోటర్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేలా అఖిలేష్ వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను అఖిలేష్ వర్గం ఇప్పటి వరకు ఖండిచలేదు.అఖిలేష్ కొత్త పార్టీ పెడితే యాదవ పరివార్‌లో చీలిక వచ్చినట్లుగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.