బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్‌తో తేజ్ ప్రతాప్ పెళ్లి జరగనుంది. తల్లి రబ్రీదేవి చూసిన సంబంధానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు తేజ్ ప్రతాప్. ఇక వీరిద్దరి నిశ్చితార్థం ఈ నెలాఖరులోగా, పెళ్లి వచ్చే నెలలో జరుగుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతాలకు చెందిన వీఐపీలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు.
ఢిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ గ్రాడ్యుయేట్ అయిన ఐశ్వర్యరాయ్ తండ్రి చంద్రికా రాయ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు చిరకాల మిత్రుడు. ఆర్జేడీ తరఫున ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. లాలు కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఐశ్వర్య తాతయ్య ప్రసాద్ రాయ్ 1970వ దశకంలో బీహార్ కు 11 నెలల పాటు సీఎంగా కూడా పనిచేశారు. బీహార్ లో తొలి యాదవ ముఖ్యమంత్రి ఆయనే కావడం గమనార్హం.
తన కుమారుల పెళ్లి గురించి లాలూ సతీమణి రబ్రీ దేవి గతంలో మాట్లాడుతూ.. తనకు సంస్కారవంతమైన కోడళ్లు కావాలని అన్నారు. షాపింగ్ మాల్స్‌కి వెళ్లకుండా .. ఇంట్లోనే ఉండి అన్ని పనులు చూసుకునేవారు కావాలని చెప్పడం అప్పట్లో వైరల్‌గా మారింది. కుమారుడి పెళ్లి కోసం దాణా కేసులో జైలులో ఉన్న లాలూకు పెరోల్ లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.