ఢిల్లీ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అత్యవసర సమావేశం నిర్ణయాలపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులు తీవ్రంగా క్షీణించిన నేపథ్యంలో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిత్యవసర వస్తువులు, సరుకులు సరఫరా చేసే ట్రక్కులు మినహా వేరే ఇతర ట్రక్కులను నవంబర్ 21వరకు ఢిల్లీ లోకి అనుమతించరాదని పేర్కొంది.
పరిస్థితులను బట్టి ట్రక్కుల పై నిషేధాన్ని మరింత పొడిగించాలన్నారు. సీఎన్జీ తో నడిచే బస్ సర్వీస్ ల సంఖ్యను పెంచాలన్నారు. రైల్వేలు, మెట్రో, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్ ,రక్షణ, జాతీయ అవసరాల సంబంధిత ప్రాజెక్టులు మినహా మరే ఇతర నిర్మాణ కార్యకలాపాలను నవంబర్ 21 వరకు అనుమతించరాదన్నారు.
కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్మోగ్ టవర్స్, రోజుకు మూడుసార్లు నీటిని స్ప్రే చేయాలని సూచించింది. డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించాలని పేర్కొంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మంది సిబ్బందికి వర్క్ ఫ్రం హోం అమలుచేయాలన్నారు. ప్రైవేటు ఆఫీసులు, కార్యాలయాల్లో కూడా సగం మంది సిబ్బందికి వర్క్ ఫ్రం హోం అమలయ్యేలా చూడాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలను ఆదేశించారు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఢిల్లీ కి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 ధర్మల్ పవర్ ప్లాంట్లలో ఐదింటిని మినహా మిగతా వాటి కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది.