అఫ్గానిస్థాన్ లో అధికారం చేజిక్కించుకొని ఏడాది గడువు సమీపిస్తోన్న వేళ…తాలిబన్లు మరోసారి మహిళలపై విరుచుకుపడ్డారు. హక్కుల సాధనకు రాజధాని కాబుల్ లో వారు చెపట్టిన ఓ నిరసన ర్యాలీని హింసాత్మకంగా అణచివేశారు. మహిళా నిరసన కారులను చెదర గొట్టేందుకు గాల్లో కాల్పులు జరపడంతో పాటు వెంబడించి మరీ వారిపై దాడులకూ పాల్పడనట్లు మీడియా కథనాలు తెలిపాయి. గతేడాది ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళల హక్కులను కాలరాస్తూ అంతకు ముందు రెండు దశాబ్ధాల్లో వారు సాధించిన ప్రగతిని అణగదొక్కుతోన్నారని అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే శనివారం దాదాపు 40 మంది మహిళలు ఉద్యోగ హక్కుతో పాటు రాజకీయ భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ కాబుల్‌లోని విద్యా శాఖ భవనం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఆగస్టు 15 బ్లాక్ డే అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేశారు. అజ్ఙానంతో విసిగిపోయాం న్యాయం కావాలంటూ ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు తుపాకులతో గాల్లో కాల్పులు జరుపుతూ వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సమీపంలోని దుకాణాల్లో తల దాచుకున్న కొంత మంది మహిళా నిరసన కారులను వెంబడించి దాడులు చేశారు. అక్కడున్న కొంతమంది జర్నలిస్టులపైనా దాడి చేశారు. ఆఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళా స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నట్లు పలు నివేదికలు వెలువడుతున్నాయి. దేశంలో ఇప్పటికే వేల మంది బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారు. మహిళలు ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు విధించారు. దూరప్రయాణం చేయాలకునే మహిళలకు తోడుగా దగ్గరి మగ బంధువు ఉంటే తప్ప రవాణా సౌకర్యం కల్పించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తమ హక్కుల కోసం మహిళలు పలు సందర్భాల్లో గొంతును వినిపించినా… ఆంక్షల పరంపర కొనసాగుతోంది. అనేక నెలల తర్వాత తాజాగా మరోసారి నిరసనకు దిగగా దాన్నీ అణచివేశారు.