పేదలను ముంచి కార్పొరేట్లకు దోచిపెట్టడమేనా…: కేటీఆర్‌

42
ktr
- Advertisement -

దేశంలో ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కార్పొరేట్లకు దోచి పేదలను వంచిస్తున్న మోదీపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. పేదల పథకాలపై మోదీకి ఎందుకంత అక్కసు అంటూ ధ్వజమెత్తారు. పేదవాడి పొట్టకొట్టేందుకు కేంద్రం కొత్త పాచిక ఈ ఉచిత పథకాలపై చర్చ అని విమర్శించారు. అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటీ?.. బడుగు బలహీన వర్గాల ప్రజలే మీ టార్గెటా?.. పేదలకు ఇస్తే ఉచితాలా?.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అంటూ ప్రశ్నించారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోదీ విధానమా?, రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్‌ రుణమాఫీ ముద్దా?.. అని ఆరోపించారు. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు.. కార్పొరేట్‌కు పన్నురాయితీనా? అని నిలదీశారు.

మోదీ ప్రభుత్వం రూ.80లక్షల కోట్ల అప్పు తెచ్చిందని, ఈ అప్పు తెచ్చి ఎవరిని ఉద్దరించారని ప్రశ్నించారు. దేశ సంపదను పెంచే తెలివి మోదీ ప్రభుత్వానికి లేదని, సంపద పెంచి పేదల సంక్షేమానికి ఖర్చు చేసే మనసు లేదన్నారు. ఓ వైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై జీఎస్టీ పెంచి కేంద్రం ప్రజల రక్తాన్ని జలగల్లా జుర్రుకుంటోందని, మరో వైపు పేదల నోటికాడ లాగేసే దుర్మార్గానికి తెగించిందంటూ మండిపడ్డారు. ఆకలి సూచీలో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నామని, దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5శాతం పోషకాహార లోపంతో పెరుగుదల సరిగాలేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. మోదీకి ముందున్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ఒక్కరే రూ.80లక్షల కోట్లకుపైగా అప్పు చేశారని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే వార్షిక రాబడిలో 37శాతం ఖర్చు అవుతోందని, ఇదే విషయంలో కాగ్‌ హెచ్చరిక చేసిందని గుర్తు చేశారు.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం.. కేంద్రం జీడీపీలో 40శాతానికి మంచి అప్పులు చేయకూడదని, మోదీ సర్కారు ఈ విషయంలో 54శాతం అప్పులు చేసిందని కాగ్‌ తలంటిందన్నారు. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని కాగ్‌ హెచ్చరించిందని అన్నారు. ఇంత సొమ్ము అప్పుగా తెచ్చి మోదీ ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కట్టిండ్రా?.. మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా?.. పేదల కడుపు నింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా? అని నిలదీశారు. ఇవేవీ చేయనప్పుడు ఇన్నిలక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరాయో మోదీనే చెప్పాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

- Advertisement -