దక్షిణాదిలో అత్యంత వివాదాస్పదమైన సినిమా మెర్సల్. విజయ్ హీరోగా తెరకకెక్కిన ఈ సినిమాలో కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ డైలాగ్‌లు ఉండటం వివాదం రాజుకోవడంతో సినిమా యావత్ దేశ దృష్టిని ఆకర్షించింది. అయితే,తమిళ్‌లో విడుదలైన ఈ సినిమాకు తెలుగులో మాత్రం అడ్డంకి తప్పలేదు. అన్ని అడ్డంకులను తొలగిపోవడంతో అదిరింది ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తెలుగులో విజయ్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు..?వివాదానికి కేంద్రబిందువైన డైలాగులు సినిమాలో ఉన్నాయా లేదా చూద్దాం… ,
కథ:
భార్గవ్(విజయ్) ఓ డాక్టర్. పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలన్నది అతని జీవితం ఆశయం. అందుకే రూ.5కే వైద్యం అందిస్తుంటాడు. అతని సేవను గుర్తించిన ఓ సంస్థ అవార్డును ఇస్తామని భార్గవ్‌కు ఆహ్వానం పంపుతుంది. దీంతో భార్గవ్ ఫారిన్ వెళ్తాడు. అక్కడ పల్లవి(కాజల్) పరిచయం అవుతుంది. మరోపక్క ఇండియాలో వరుసగా కిడ్నాప్‌లు జరుగుతాయి. దానికి కారణం భార్గవ్ అని తెలుస్తుంది. భార్గవ్‌కు అవార్డు అందించిన డాక్టర్ హత్యకు గురవుతాడు. ఈ హత్యలకీ, కిడ్నాప్‌లకు ఉన్న సంబంధం ఏంటి? వైద్య రంగంలో లోపాలను భార్గవ్ ఎలా ఎత్తి చూపించాడు. అన్నదే కథ!
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ హీరో విజయ్ నటన,కథ, కమర్షియల్ అంశాలు,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. విజయ్ నటన సినిమాకే హైలైట్. మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్, ప్రతీ పాత్రలోనూ వేరియేషన్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ విజయ్ నటన కంటతడి పెటిస్తుంది. హీరోయిన్లుగా కాజల్, సమంత నిత్యామీనన్‌లు కనిపించినా.. చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది మాత్రం ఒక్క నిత్యామీనన్‌కే. ఇతర పాత్రల్లో సత్యరాజ్, వడివేలు, కోవే సరళ తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్,తెలుగు నేటివిటీ మిస్సవడం, పాటలు. ప్రభుత్వాసుపత్రులు ఎలా ఉండాలి? కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడి ఎలా ఉంది? వంటి అంశాలను మాస్‌కు నచ్చేలా తీసినా..వివాదాస్పదమైన జీఎస్‌టీ.. నోట్లరద్దు.. లాంటి డైలాగులకు తెలుగులో కత్తెర్లు పడ్డాయి. ముఖ్యంగా సినిమాకు ఇంతటి హైప్ రావడానికి కారణమైన డైలాగ్‌లను మ్యూట్ చేయటం కూడా ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు సెంకడ్‌హాఫ్‌లో మాత్రం స్లోగా కథ నడిపించాడు.
సాంకేతిక విభాగం:
రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరింత భారీతనం తీసుకొచ్చింది. అట్లీ ఒక బలమైన కథను తీసుకుని, దానికి వాణిజ్య అంశాలను పేరుస్తూ ఓ కమర్షియల్ సినిమాను తీర్చిదిద్దాడు. అదే సమయంలో విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలను రాసుకొన్నాడు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తీర్పు:
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు విజయ్. గతంలో ‘స్నేహితుడు’, ‘తుపాకీ’, ‘పులి’, ‘పోలీసోడు’, ‘భైరవ’ చిత్రాలతో ఆకట్టుకున్న విజయ్ అదిరింది ప్రేక్షకులను ఆకట్టకునే ప్రయత్నం చేశారు. విజయ్ నటన, కథ సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్, తెలుగు నేటివిటీ, వివాదాస్పద డైలాగ్‌లు సినిమాలో లేకపోవడం మైనస్ పాయింట్స్. మొత్తంగా అదిరిందితో విజయ్ ఆకట్టుకున్నాడనే చెప్పాలి.
విడుదల తేదీ:09/11/2017
రేటింగ్:3/5
నటీనటులు: విజయ్ ,ఎస్.జె.సూర్య,సమంత,కాజల్ అగర్వాల్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: అట్లీ