మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజాపై సీనియర్ నటి తులసి మండిపడ్డారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తులసి మా అధ్యక్షుడిగా తన అధికారాన్ని తప్పుడు దారిలో వినియోగిస్తున్నాడని నిప్పులు చెరిగింది. కె విశ్వనాథ్ం ‘శంకరాభరణం’ సినిమాలో ‘శంకరం’ పాత్రతో సినిమా రంగంలోకి తులసి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనను సినిమా రంగంలోకి తీసుకొచ్చిన విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అవార్డు వచ్చిన సందర్బంగా శంకరాభరణం పేరిట ఉత్తమ నటన కనబరిచిన వారికి ఏటా అవార్డులు ఇస్తానని ఆమె ప్రకటించారు.
ఈ ఏడాది హైదరాబాద్‌లో వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. అయితే ఎవరూ కూడా ఆ ఫంక్షన్ కు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో తులసి మాట్లాడుతూ, దీనికంతా కారణం శివాజీరాజానే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను ఒక జోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అవార్డుల వేడుకకు గెస్ట్ లు రాకుండా అడ్డుకున్నాడని విమర్శించారు. ‘సంతోషం’ మ్యాగజైన్ ఓనర్ సురేష్ కొండేటిపై కూడా ఆమె ధ్వజమెత్తారు. వాళ్లిద్దరూ కలిసి తను ఏర్పాటు చేసిన అవార్డుల ఫంక్షన్ కు సినిమా వాళ్లను రాకుండా చేశారని తులసి ధ్వజమెత్తారు.
తాను నిర్వహిస్తున్న ఈ అవార్డులకు ప్రముఖులు వస్తే తన స్థాయి మరింత పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఎవరూ ఈ అవార్డుల వేడుకకు రాకుండా శివాజీ రాజా పన్నాగాలు పన్నారని, వారు రాకపోవడానికి కారణం ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాయేనని తులసి ఆరోపించారు. మరి దీనిపై శివాజీ రాజా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..