తెలుగు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలని ఎందరో ఎన్నో కలలతో సినీ రంగం లోకి అడుగుపెడతారు. కానీ సరైన దారి తెలియక, సరైన అవకాశాలు రాక ,ఏదైనా ఒక్క అవకాశం తమ వశం అయితే చాలనుకుని ఇండస్ట్రీనే తమ జీవితంగా నమ్ముకుని బ్రతికేవాళ్లు హైదరాబాద్ వీధి వీధి లో కనిపిస్తారు. వాళ్లలో మహిళల పరిస్థితి వర్ణించలేనిది. అలా ఇండస్ట్రీ లోకి ఎన్నో ఆశలతో తన పయనం మొదలుపెట్టిన ఓ హీరోయిన్ సంవత్సరాల తరబడి ఇంకా అవకాశాలకోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె చాందిని చౌదరి..
ఆ పేరు సినీ ప్రేక్షకులకు అంతగా తెలియకపోయినా యూట్యూబ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మాత్రం బాగా తెలిసినపేరు. ఒకరకం గా తెలుగు షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె క్వీన్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 50 కి పైగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన చాందిని, తను షార్ట్ ఫిలిమ్స్ లోకి రావడానికి కారణం ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అని, ఆ సంస్థ వల్ల తన కెరీర్ దెబ్బతినిందని చెప్తుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమె తను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతోందని, హౌరా బ్రిడ్జి,కుందనపు బొమ్మ, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు చేసినా కూడా తనకి ఇంకా గుర్తింపు రాలేదని వివరించింది. తన కెరీర్ మొదట్లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తనతో 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేయించుకుందని, కానీ ఆ కాల గడువులో వాళ్ళు తీసిన 3 సినిమాల్లోనూ తనకి అవకాశం ఇవ్వలేదని తెలిపింది. ఆ తర్వాత వాళ్ళు తన కెరీర్ తో ఆడుకుంటున్నారని అర్ధమై ఆ సమయం లో తన దగ్గరకు వచ్చిన షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్స్ ను ఒప్పుకున్నట్టు చాందిని తెలిపింది. తన వెనుక వచ్చిన వారు కూడా ఇప్పుడు మంచి మంచి స్థానాల్లో ఉన్నారని, తనకు మాత్రం ఇంకా మంచి అవకాశం చేతికి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
చాందిని చౌదరి లాంటి ఎందరో అమ్మాయిలు ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సినీకెరీర్ ని జీవితంగా భావించి ఇలా ఎన్నో కష్టాలు పడుతున్నవారికి తమ సత్తా నిరూపించుకునే అవకాశం త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.