మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఉన్న బోర్సార్ గ్రామం ఒక వినూత్న నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామంలో తిట్లు, దూషణలు వాడకుండా ఉండేందుకు “అబ్యూస్-ఫ్రీ విలేజ్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ నిబంధన ప్రకారం, ఎవరైనా తిట్లు మాట్లాడితే రూ.500 జరిమానా చెల్లించాలి లేదా ఒక గంట పాటు గ్రామంలో శుభ్రత పనులు చేయాలి. ఈ నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఆమోదించింది. గ్రామమంతా ఈ నిబంధనపై పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు.
ఉప సర్పంచ్ వినోద్ షిండే మాట్లాడుతూ, “పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తిట్లు మాట్లాడటం ఎక్కువైంది. ముఖ్యంగా తల్లి, చెల్లెలు వంటి సంబంధాలపై దూషణలు చేయడం పెరిగింది. దీన్ని తగ్గించేందుకే ఈ చర్య తీసుకున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమం ఇప్పటికే మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన చెప్పారు. గ్రామ ప్రజలు ఇప్పుడు తమ మాటలపై జాగ్రత్తగా ఉంటున్నారని, పొరుగున ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన జయశ్రీ అనే మహిళ మాట్లాడుతూ, “ఇప్పుడేమో తిట్లు మాట్లాడటానికి భయపడుతున్నారు. ముందు పిల్లలు కూడా అర్థం లేకుండా దూషణలు చేసేవారు. ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారింది” అని చెప్పారు.
Also Read:బాధితుల ఫోటోలతో పాక్‌కు ఇరాన్ ప్రతినిధులు
యువకుడు అశ్విన్ పటేల్ మాట్లాడుతూ, “ఈ ఆలోచన మొదట నాదే. చిన్నపిల్లలు కూడా తిట్లు మాట్లాడటం చూసి ఆందోళన కలిగింది. అందుకే సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం” అని వివరించారు.ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటిసారిగా అమలు చేస్తున్న ప్రయత్నంగా గుర్తింపు పొందింది. గ్రామ ప్రజలంతా కలిసి “తిట్లు లేని గ్రామం”గా మార్చాలని సంకల్పించారు.

