అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్థావరంపై అమెరికా గురువారం అతి పెద్ద బాంబుతో విరుచుకపడిన సంగతి తెలిసిందే. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.32కు పాక్ సరిహద్దుల్లోని నాన్గర్హర్ ప్రావిన్సులోని అచిన్ జిల్లాలో ఉన్న టన్నెల్ సముదాయంపై జీబీయూ-43/బి బాంబును జార విడిచినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలియజేసింది.
‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా పిలిచే అతి శక్తిమంతమైన ఈ బాంబు 21,600 పౌండ్ల బరువుంటుంది. జీపీఎస్ ఆధారంగా పని చేస్తుంది. ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక కార్యకలాపాల కమాండ్ నడిపే ఎంసీ-130 యుద్ధవిమానం ద్వారా ఈ బాంబును జార విడిచారు.
జీబీయూ-43 గురించిన ఆసక్తికర అంశాలివి.
() ఆక్రోనిమ్ ఆధారిత బాంబు ఇది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ఎంఓఏబీ (మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్)గా అభివర్ణిస్తుంది.
()పెంటగాన్ వర్గాల ప్రకారం, ఇది అతిపెద్ద అణ్వస్త్ర రహిత బాంబు. దీన్ని యుద్ధంలో తొలిసారిగా వాడారు.
() 9,797 కిలోల బరువు, 20 అడుగుల పొడవు, జీపీఎస్ గైడెడ్ వ్యవస్థ దీనిలో ఉంటాయి.
() పేలిన తరువాత భూమిలోకి 200 అడుగుల వరకూ చొచ్చుకెళుతుంది. కాంక్రీటు నిర్మాణాలైతే, 60 అడుగుల మందమైన కాంక్రీటును నాశనం చేయగలుగుతుంది.
() ఈ బాంబును తొలిసారిగా 2003లో పరీక్షించారు. ఆ సమయంలో 20 మైళ్ల పరిధిలో పుట్టగొడుగు ఆకారంలో దుమ్ము మేఘం ఏర్పడింది.
() ఇప్పుడు దీన్ని లక్హీద్ ఎంసీ-130 రవాణా విమానంలో తీసుకు వచ్చి, సరిగ్గా 7:32 గంటల సమయంలో అమెరికా దీన్ని అఫ్గన్ లో గుర్తించిన ఉగ్రవాద స్థావరంపై జారవిడిచింది.
() అమెరికా, ఆఫ్గన్ సంయుక్త దళాలు చొచ్చుకుపోయేందుకు మార్గం సుగమం చేయడంతో పాటు ఐఎస్ఐఎస్ ఫైటర్ల ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ బాంబును జారవిడిచినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
() కాగా, ఈ బాంబుకన్నా నాలుగు రెట్ల శక్తిమంతమైన బాంబును తయారు చేసి 2007లో పరీక్షించిన రష్యా దానికి ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అని నిక్ నేమ్ పెట్టుకోవడం గమనార్హం.
ఈ బాంబు దాడిపై ట్రంప్ స్పందించారు. అమెరికా సైనిక శక్తిని చూసి తనకెంతో గర్వంగా ఉందని, వారికి అన్ని అధికారాలూ ఇవ్వడంతోనే, మరో సక్సెస్ ను చవిచూశామని అన్నారు. సాధారణ పౌరులకు ఎటువంటి హానీ కలుగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునే బాంబును ప్రయోగించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు. ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును ప్రయోగించడాన్ని స్వాగతించిన భారత ప్రముఖులు, పనిలో పనిగా పాక్ కేంద్రంగా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాల సంగతిని కూడా చూడాలని కోరుతున్నారు.