ఢిల్లీలో గత 10–15 రోజులుగా విద్యార్థి సంఘాలు, యువత తమ డిమాండ్ల సాధన కోసం రోడ్లపై నిరసనలు చేస్తున్నారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. నిరసనకారులను పోలీసులు రోడ్లపై ఈడ్చుకెళ్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు నిరసనలకు దిగినప్పుడు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్ వంటి నేతలను సైతం నిర్బంధించడంపై ఆయన ప్రశ్నలు సంధించారు.
ఇంతటి ఆంక్షలు, భారీ భద్రతా ఏర్పాట్లు ఎవరి కోసం చేస్తున్నారని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కోసమేనా ఈ చర్యలన్నీ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్టోబర్ 10న ఇచ్చిన పిలుపు నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారిగా రైల్వే సేవలను నిలిపివేశారేమోనని వ్యాఖ్యానించారు. రైల్వేలతోపాటు ఢిల్లీలో మెట్రో సేవలు, కొన్ని స్టేషన్లను కూడా మూసివేశారని ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం సంతృప్తి చెందకుండా జమ్మూ కశ్మీర్ నుంచి భద్రతా బలగాలను రప్పించిందని విమర్శించారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని కూడా చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తారా? అలా చేస్తే అది ఎవరి కోసం.. జ్ఞానేశ్ కుమార్ కోసమేనా? అని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. జ్ఞానేశ్ కుమార్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తోందని నిలదీశారు.ఢిల్లీలో రైల్వేలు, మెట్రో సేవలను నిలిపివేసి నగరాన్ని భారత్-పాకిస్థాన్ సరిహద్దులా మార్చేశారని ఆయన ఆరోపించారు. విద్యార్థి సంఘాల సభ్యులు, ప్రతిపక్ష నేతలు, మాజీ ముఖ్యమంత్రులను రోడ్లపైకి లాగి నిర్బంధించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సహకరిస్తున్నారనే అనుమానం ఎందుకు రాకూడదని అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. అలాంటి సహకారం లేదంటే, కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇంత భారీ భద్రత ఎందుకు కల్పిస్తోందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు, రాజకీయ భిన్నాభిప్రాయాలకు గౌరవం ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Also Read:ఢిల్లీ నిరసనలు..అరెస్టులపై పిటిషన్లు

