NHM ఉద్యోగుల రెగ్యులరైజ్ ఎప్పుడు?

8
- Advertisement -

నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులను ఆయన పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామని, వారి న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు.

గతంలో చాయ్ తాగేంత సమయంలోనే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి NHM ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

NHM, ఆయుష్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని హరీశ్ రావు అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ జీతాలు, ఇతర బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వారి సమస్యలను ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని హరీశ్ రావు సూచించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Also Read:ఢిల్లీ నిరసనలు..అరెస్టులపై పిటిషన్లు

- Advertisement -