జూలైలో కేబినెట్ విస్తరణ..కొందరి శాఖల మార్పు..!

571
cm kcr cabinet
- Advertisement -

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూలై 5న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల కంటే ముందే కేబినెట్ విస్తరణ ఉండేలా సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సారి కేబినెట్‌లో కేటీఆర్‌తో పాటు హరీష్‌ రావుకు ప్రాతినిధ్యం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

మంత్రివర్గ విస్తరణతో పాటు కొంతమంది మంత్రుల శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కేబినెట్‌లో హరీష్‌కు నీటి పారుదల శాఖ కేటాయించగా ఈసారి విద్యాశాఖను కేటాయిస్తారని సమాచారం. ఇప్పటివరకు ఈ శాఖను మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహిస్తుండగా ఆయనకు వేరే శాఖను కేటాయించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో పాటు తనవద్దే ఉంచుకున్న ఆర్ధిక శాఖను వేరేవారికి కేటాయించనున్నట్లు సమాచారం.

వాస్తవానికి మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిస్ధాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై టీఆర్ఎస్ నేతలు ఎప్పుడు స్పందించలేదు. అయితే జూలైలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈసారి కేబినెట్ విస్తరణ ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇప్పటివరకు మంత్రివర్గంలో 11 మంది ఉండగా మరో ఆరుగురికి మాత్రమే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్నవారిలో రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదుగురు, బీసీలు ముగ్గురు,ఎస్సీ, మైనారిటీ, వెలమ వర్గాల నుంచి ఒక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం లేదు. వీటితోపాటు ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది.

- Advertisement -