శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 167 మంది మృతిచెందినట్లు సమచారం. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో వందల మంది చనిపోయారు.
ఇక ఉన్మాదులు మూడు చర్చిలు.. మూడు స్టార్ హోటళ్లను టార్గెట్ చేశారు. అయితే సూసైడ్ బాంబర్లే ఈ మారణహోమానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కొలంబోలోని షాంగ్రిలా హోటల్‌లో ఈనెల 20వ తేదీన ఇద్దరు వ్యక్తులు ఓ రూమ్ బుక్ చేసుకున్నారు. వారు రూమ్ నెంబర్ 616లోకి చెకిన్ అయ్యారు.
అయితే హోటల్‌లోని సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ఆ ఇద్దరు అనుమానితులు సూసైడ్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. షాంగ్రిలా హోటల్‌లోని కాఫిటేరియా, కారిడర్ వద్ద వాళ్లు తమను తాము పేల్చుకున్నారు. పేలుళ్ల కోసం సీ-4 ఎక్స్‌పోజివ్స్‌ను వాడినట్లు తెలుస్తోంది. ఆ హోటల్‌ను పేల్చేందుకు సుమారు 25 కిలోల బాంబులు వాడారు.
రూమ్‌లోకి ప్రవేశించిన పోలీసులు అక్కడ నుంచి కొన్ని వస్తువులను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సూసైడ్ బాంబర్లు.. ఇస్లామిక్ తీవ్రవాదులు అని విచారణాధికారులు ఓ అంచనాకు వచ్చారు. అయితే వాళ్లు ఎక్కడి వారని ఇంకా స్పష్టంగా తెలియాల్సివుందని పోలీసులు తెలిపారు.