బీజేపీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమని ప్రకటించారు సినీ నటుడు,రెబల్ స్టార్ కృష్ణంరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే తిరిగిపోటీచేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. నరసాపురం లేదా కాకినాడ నుండి ఆయన పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ సీనియర్ నేతగా ఉన్న రెబల్ స్టార్ 1998 లో కాకినాడ నియోజకవర్గం ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన కృష్ణంరాజు మాజీ ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రింగా పనిచేశారు.
మాస్ హీరోగా తెలుగు ఇండస్ట్రిని షేక్ చేశారు కృష్ణంరాజు. నాలుగు ఫిలింఫేర్ లతో పాటు రెండు నంది అవార్డులు అందుకున్నారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవిది అదే ఊరు కావడం విశేషం. చిరు స్ధాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత తన సొంతగూటికి బీజేపీలో చేరారు. చాలాకాలంగా ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది.