ఐపీఎల్-11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ పరుగుల వరద కురిపిస్తున్నాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న రాజస్థాన్ని ఒంట్టిచేత్తో ప్లే ఆఫ్ దిశగా తీసుకెళ్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో ఫోర్లు, సిక్సులతో పరుగుల వర్షం కురిపించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ పరుగుల సునామితో చెలరోగడంతో ముంబై ఓటమి చవిచూసింది.
ఈ మ్యాచ్ లో బట్లర్ 53 బంతుల్లో 94 రన్స్ చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఐదు ఆఫ్ సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్‌గా సెహ్వాగ్ పేరుమీదున్న రికార్డును బట్లర్ సమం చేశాడు. 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన సెహ్వాగ్ వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డును సృష్టించాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ భారాన్ని మొత్తం మోస్తున్న బట్లర్… ఢిల్లీపై జరిగిన మ్యాచ్‌లో 67, పంజాబ్‌పై 51, 82, చెన్నైపై 95, ముంబైపై 94 పరుగులు చేశాడు. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచులలో 6 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ ప్లే ఆఫ్‌కి చేరాలంటే మిగతా రెండు మ్యాచ్‌లు కూడా ఖచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం ఈ జట్లు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో ఓడిన ముంబై ప్లే ఆఫ్ ఆశలు కోల్పోయింది.