అత్యాచార కేసులో ఆసారాంబాపు దోషిగా తేలి జీవిత ఖైదీగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ నటి రాఖీసావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన ఆసారాంబాపుకి జీవిత ఖైదు సరిపోదని.. ఇలాంటి వారికి ఉరిశిక్ష విధించడమే సరైందని వెల్లడించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆసారాం తనపై అత్యాచారం చేశాడని 2013లో ఓ 16 ఏళ్ల బాలిక కేసు పెట్టింది. 2013లో అరెస్టయిన ఆసారాం.. ఆ రోజు నుంచి జోధ్ పూర్ సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. అయితే నేరం రుజువు కావడంతో ఈ ఏప్రిల్ 25న ఆసారాంకిని జోధ్ పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ క్రమంలో స్పందించిన రాఖీ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. ఆసారాంకి శిక్ష పడినందుకు చాలా సంతోషంగా ఉందని, అత్యాచారాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక అని తెలియజేశారు.
అంతేకాకుండా మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన ఆసారాంకి ఎందుకు ఉరిశిక్ష విధించలేదని, మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే కఠిన చట్టాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, కావున ఆసారాంకి ఉరి శిక్ష విధించడమే సరైందన్నారు.
ఇక ఇదిలా ఉండగా..విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆసారాం ఈ జైల్లో ఉండలేకపోతున్నానని, తొందరగా బెయిల్ వచ్చే విధంగా చూడాలని తన అనుచరులకు సూచించారట. సరైన ఆహారం పెట్టడం లేదని, జైల్ గోడల మధ్య నిద్ర కూడా రావడం లేదని ఆసారాం అనుచరులతో చెప్పుకున్నారని తెలుస్తోంది.