తెలంగాణ అగ్రభాగాన నిలబడిందంటే ఆ ఘనత కేసీఆర్‌దే అన్నారు ఎంపీ కే కేశవరావు. పార్టీ ప్లీనరీలో భాగంగా దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం ఉద్యమం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆయన స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు ఏమి లేవన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ్ కీ నేత కేసీఆర్ అని పిలుపునిచ్చారు కేకే.
థర్డ్ ఫ్రంట్ రాజకీయ నినాదం కాదని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకేనని తెలిపారు కేకే. సమస్యను సమూలంగా అర్ధం చేసుకొని దానిని పరిష్కరించ గల దమ్మున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రాలకు సాధికారత వస్తేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి…సమైక్య స్పూర్తి వర్ధిల్లాలని తెలిపారు. వ్యవసాయం,విద్య,పట్టణాభివృద్ధి జరగాలన్నారు.
రాష్ట్రాల అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఇవ్వాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాల ఏకపక్ష వైఖరితో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇందుకోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ అడుగులో అడుగు వేసి ముందుకు సాగుదామన్నారు. కేసీఆర్‌కు అండదండలు అందించి సంపూర్ణ మద్దతు ఇద్దమని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి సంపూర్ణ నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్‌కే ఇస్తున్నామని తెలిపారు కేకే. కేశవరావు ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ బలపర్చారు.