రాజకీయాల్లోకి వస్తున్నా-రజినీ

227
- Advertisement -

రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెరదించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. చెన్నైలో ఆరో రోజు అభిమానులతో సమావేశమైన రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. తన అభిమాన కథానాయకుడి రాజకీయ ప్రవేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పడింది. ఇటీవలి కాలంలో అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇవాళ ప్రకటిస్తానన్న విషయం తెలిసిందే.

అయితే ఇంటి నుంచి అభిమానులతో భేటీఅయ్యే ప్రదేశం శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపానికి బయల్దేరేటప్పుడు సైతం మీడియా ఆయనను పలకరించినా స్పందించలేదు. సభా స్థలికి చేరుకున్న అనంతరం అభిమానులతో భేటీ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టంచేశారు. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ..

Rajini to Contest all Seats in Next Assembly Elections

దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్నారు. రాజకీయ మార్పు కోసం సమయం ఆసన్నమైందని తెలిపారు. పదవి, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానన్నారు. తమిళ ప్రజల మద్దతు ఉంటే నిజాయితీతో కూడిన రాజకీయాలు సాధ్యమనన్నారు. ప్రజల ఆదరణ, దేవుని కటాక్షం తనకున్నాయని నమ్ముతున్నట్లు చెప్పారు. గతంలో వలస పాలకులు మన దేశాన్ని కొల్లగొట్టారు. కానీ ఇప్పుడు మన పాలకులే ప్రజాస్వామ్యం పేరుతో మనల్ని కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లోపే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు తెలిపారు. 234 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. రజనీ రాజకీయ ప్రవేశంతో అభిమానుల ఆనందంలో మునిగారు.

- Advertisement -