“జై బోలో తెలంగాణా” లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా “2 కంట్రీస్”కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రం “2 కంట్రీస్”. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. “ఎన్ కౌంటర్” అనంతరం ఎన్.శంకర్ మళ్ళీ “2 కంట్రీస్” సినిమాని తెరకెక్కించాడు.
అయితే తనదైన కామెడీని వదిలిపెట్టిన కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ గత నాలుగేళ్లుగా హిట్టు ముఖమే చూడలేదు. చివరగా వచ్చిన సునీల్ సినిమా ‘ఉంగరాల రాంబాబు’ కూడా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడతడి ఆశలన్నీ ‘2 కంట్రీస్’ మీదే ఉన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్.. టీజర్ కొంచెం పాజిటివ్ ఫీలింగే ఇచ్చాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ వచ్చింది. ఇది ఇంకొంచెం పాజిటివిటీని తీసుకొచ్చేలా ఉంది. సునీల్ నుంచి ఏం మిస్సవుతున్నామని ప్రేక్షకులు అంటున్నారో అది ఇందులో బాగానే కనిపిస్తోంది. అదే.. సునీల్ మార్కు కామెడీ.
మలయాళంలో సూపర్ హిట్టయిన ‘2 కంట్రీస్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కామెడీ ప్రధానంగా సాగే సినిమాలా కనిపిస్తోంది. సునీల్ ఒకప్పటిలా నవ్వించే ప్రయత్నం చేయగా.. పృథ్వీ.. శ్రీనివాసరెడ్డి.. నరేష్.. జబర్దస్త్ అప్పారావు.. తదితరులు కూడా తలో చేయి వేశారు. ఐతే కామెడీ కొంచెం లౌడ్ గా కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగానే కనెక్టయ్యేలా ఉంది. సినిమాలో కొంత మేర ఎమోషన్లకు కూడా ప్రాధాన్యం ఉందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. గత సినిమాల్లో మాదిరి సునీల్ ఫైట్లు.. డ్యాన్సులు.. హీరో ఎలివేషన్ల కోసం ప్రయాస పడినట్లు లేడు. ట్రైలర్లో ఆ ఛాయలే కనిపించలేదు. మరి ఈ సినిమాతోనైనా ఈ హీరో హిట్ అందుకుంటాడో చూడాలి. డిసెంబర్ 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.