మహేష్ బాబు తనకు తాను నటించే సినిమా కధ నచ్చితే ఆసినిమా కోసం ఎంతగానో కష్ట పడతాడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ‘స్పైడర్’ సినిమాను మహేష్ విపరీతంగా ప్రేమించాడు కాబట్టే ఆసినిమాకోసం దాదాపు ఏడాదిన్నర పాటు తన సమయాన్ని శ్రమను వెచ్చించాడు. స్పైడర్ సినిమాను దాదాపు ఏడాదిన్నర పాటు తీస్తే, అందులో 8నెలల పాటు మోకాలి నొప్పితోనే షూటింగ్ చేశానంటున్నాడు మహేష్. డాక్టర్లు అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలన్నా కూడా వినలేదట. నొప్పిని తనే భరించాడు తప్ప ఆ విషయాన్ని మేకర్స్ కు కూడా చెప్పలేదట. స్పైడర్ పోస్ట్-రిలీజ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు మహేష్.
“ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పలేదు. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో నా మోకాలికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. డాక్టర్లు సర్జరీ చేయాలన్నారు. అదే కనుక జరిగితే 5 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఓవైపు చూస్తే లండన్ నుంచి వీఎఫ్ఎక్స్ టీం వచ్చింది. 2వేల మంది జూనియర్ ఆర్టిస్టులున్నారు. నిర్మాతలకు 7-8కోట్లు నష్టం. అందుకే దెబ్బ గురించి ఎవరికీ చెప్పలేదు. ఫిజియో థెరపిస్ట్ ను పెట్టుకొని ఆ నొప్పితోనే షూటింగ్ చేశానని చెప్పాడు మహేష్ బాబు.