వర్మ ట్విట్టర్‌ను మాత్రమే వదిలాడు..సోషల్ మీడియాను కాదు. అందుకే వర్మ ట్విట్టర్ ను వదిలినా…సోషల్ మీడియాలో హీట్ పుట్టించడం మాత్రం వదల్లేదు. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఓ ఆర్టీసీ బస్సు మీద ఉన్న‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను తొలగించేసిన విషయం తెలిసిందే. ఇంకేముందీ…వర్మ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’కి మద్దతుగా హీట్ పుట్టించే వ్యాఖ్యలు చేశారు.
అర్జున్ రెడ్డి పోస్టర్లు చించేసిన హనుమంతరావు దుస్తులు చించెయ్యాలని వర్మ ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండకు సూచించారు. అంతేకాకుండా హనుమంతరావు దుస్తులు చించితే జనం జడుసుకుంటారని వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
అర్జున్ రెడ్డి సినిమాలో అందమైన హీరోయిన్ హీరో విజయ్ దేవరకొండను పెదాలపై ముద్దు పెట్టుకుంటే హనుమంతరావుకు ఈర్ష్య ఎందుకని వర్మ ప్రశ్నించారు.
అంత అందమైన అమ్మాయి జీవితంలో ఎప్పుడూ తనను ముద్దు పెట్టుకోలేదని హనుమంతరావు ఈర్ష్యపడుతున్నారా అని వర్మ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ‘మీ పార్టీ తాతయ్య అయిపోయింది. ఇప్పుడు, మీ పిల్ల చేష్టల ద్వారా ప్రజలు, మనవళ్లు, మనవరాళ్లు వచ్చే ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ఓటు వెయ్యరు. దీంతో, మీరు, మీ పార్టీ డబుల్ తాతయ్య అయిపోతారు.
తాతయ్యా..‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ లో ఏమైనా తప్పు ఉందేమో మీ మనవళ్లను, మనవరాళ్లను అడగండి? ‘అర్జున్ రెడ్డి’ సినిమా కచ్చితంగా మనవళ్లు, మనవరాళ్ల కోసమే కానీ, పాత ఆలోచనా ధోరణిలో ఉండే తాతయ్యల కోసం కాదు.. జస్ట్ చిల్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
.