అమెరికాలో చదువుకోవాలని, పరిశోధనలు చేయాలని ఆశిస్తున్న విదేశీయులకు భారీ ఊరట లభించింది. విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలపరిమితిపై ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న కొత్త విధానాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, జర్నలిస్టుల వీసాలపై గరిష్ఠ కాలపరిమితి విధించాలన్న ప్రతిపాదన చట్టబద్ధంగా లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ ఏడాది జూలైలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీని ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో నాలుగేళ్లకు మించి ఉండకుండా పరిమితి విధించాలని నిర్ణయించింది. నాలుగేళ్ల తర్వాత కూడా అమెరికాలో కొనసాగాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఫెడరల్ ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుందని ప్రతిపాదించింది. విదేశీ పరిశోధకులు, జర్నలిస్టులకు కూడా వారి వీసా కేటగిరీల ఆధారంగా నిర్దిష్ట కాలపరిమితులు విధించేలా ఈ విధానాన్ని రూపొందించింది.
అయితే ఈ ప్రతిపాదనను సవాలు చేస్తూ దాఖలైన కేసుపై విచారణ జరిపిన బోస్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ సోమవారం కీలక తీర్పు వెలువరించారు. ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదన ఏకపక్షంగా ఉందని, విచక్షణాధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఉందని పేర్కొంటూ దానిని కొట్టివేశారు. ఈ విధానం చట్టానికి అనుగుణంగా లేదని కూడా స్పష్టం చేశారు.
Also Read:సిద్దిపేటపై రేవంత్ కక్ష సాధింపు!
ఈ తీర్పుతో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులు, పరిశోధకులకు ఊరట లభించినట్లయింది. ముఖ్యంగా నాలుగేళ్ల తర్వాత కూడా తమ విద్య, పరిశోధనలను కొనసాగించాలనుకునే వారికి ఈ పరిణామం కీలకంగా మారింది.

