సిద్దిపేటపై రేవంత్ కక్ష సాధింపు!

2
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట జిల్లాపై తీవ్రమైన వ్యతిరేకత, కక్ష సాధింపు ధోరణి ఉందని మండిపడ్డారు. ఈ నెల 19న సిద్దిపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల పక్షాన బహిరంగ లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి సావాస దోషం పట్టిందని, సీఎం లాగే ఆయన కూడా ఢిల్లీలో అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, సీడబ్ల్యూసీ స్పష్టం చేసినందువల్లే.. మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చాల్సి వచ్చిందన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడేళ్లు, నేడు మూడేళ్లు కలిపి పదేళ్లు గడిచినా ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని, కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పై బురదజల్లడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 19న సిద్దిపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. గతంలో ఇచ్చిన హామీలపై స్పష్టతనివ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.రుణమాఫీ: గతంలో మొదటిసారి సిద్దిపేటకు వచ్చినప్పుడు ఆగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు వేసి మోసం చేశారని విమర్శించారు. తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలోనే వేలాది మందికి రుణమాఫీ కాలేదన్నారు.

రెండోసారి వచ్చి 45 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా ఇస్తామని చెప్పి 230 రోజులు గడిచినా అమలు చేయలేదని మండిపడ్డారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పినందువల్లే రాష్ట్రానికి కరువు వచ్చిందని విమర్శించారు.సిద్దిపేట ప్రజలు కొడంగల్‌లో తనను గెలిపించారన్న కక్షతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిని నిలిపివేశారని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు తరలించడమే కాకుండా, సిద్దిపేటలో రూ. 1070 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రద్దు చేశారని ధ్వజమెత్తారు.

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల జాబితా నుంచి సిద్దిపేటను విస్మరించడం వివక్ష కాదా అని ప్రశ్నించారు.పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపివేశారని ఆరోపించారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆయుష్ ఆసుపత్రి ప్రారంభించి ఏడాదైనా వైద్య సేవలు అందడం లేదని మండిపడ్డారు.మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కాల్వల తవ్వకాన్ని మూడేళ్లుగా ఆపివేసి సిద్దిపేటకు కరువును రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:UP:అఖిలేష్‌కు కాంగ్రెస్ జాబితా!

“నువ్వు మళ్లీ సిద్దిపేటకు వస్తున్నావు.. స్వాగతం పలుకుతున్నాం. కానీ ఒకే ఒక్క షరతు.. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ రుణమాఫీ, రైతు భరోసా నిధులు అందించి సిద్దిపేటకు రా, నేనే స్వయంగా నీకు బొకే ఇస్తా” అని హరీశ్ రావు సవాల్ విసిరారు. సిద్దిపేట ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడొద్దని, నిలిపివేసిన పనులను వెంటనే పునఃప్రారంభించి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -