భారత్ చేపడుతున్న నీటి నిర్వహణ కార్యక్రమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రపంచ బ్యాంకు గ్రూప్ సీనియర్ అధికారి ప్రశంసించారు. తాగునీటి లభ్యతను మెరుగుపరచడం, నదుల పునరుద్ధరణ, డ్యామ్ల భద్రతను బలోపేతం చేయడం వంటి అంశాల్లో భారత్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు గ్రూప్లో నీటి విభాగం గ్లోబల్ డైరెక్టర్గా ఉన్న సరోజ్ కుమార్ ఝా.. భారత్ సాధించిన పురోగతిని అద్భుతమైన విజయగాథగా అభివర్ణించారు. నీటి సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్ అనుభవాలను పరిశీలిస్తున్నాయని తెలిపారు.
2026 ఐక్యరాజ్యసమితి జల సదస్సుకు ముందు శుక్రవారం నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో పీటీఐ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
ప్రపంచ బ్యాంకు గ్రూప్ దృష్టిలో భారత్ నీటి నిర్వహణలో అద్భుతమైన విజయగాథ. ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ అనుసరిస్తున్న నీటి నిర్వహణ విధానాన్ని పరిశీలిస్తోంది అని సరోజ్ కుమార్ ఝా వెల్లడించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సెనెగల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి జల సదస్సు డిసెంబర్ 8 నుంచి 10 వరకు అబుదాబిలో జరగనుంది. నీటి భద్రత, పారిశుద్ధ్యంపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఇందులో ప్రపంచ దేశాల నాయకులు, విధాన నిర్ణేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు.
Also Read:వందేభారత్ స్లీపర్ రైళ్లలో ‘తత్కాల్’ ఉండవు!
భారత్ చేపట్టిన పలు కీలక కార్యక్రమాలను సరోజ్ కుమార్ ఝా ప్రత్యేకంగా ప్రస్తావించారు. జల్ జీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలు ఇతర దేశాలు కూడా అనుసరించదగిన ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తున్నాయని చెప్పారు.
భారత్లో నీటి నిర్వహణకు సంబంధించిన మొత్తం వ్యవస్థను ప్రపంచ బ్యాంకు పరిశీలిస్తోందని తెలిపారు. ఈ రంగంలో దేశం ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చేపట్టిన చర్యలు నిజంగా ప్రశంసనీయమని సరోజ్ కుమార్ ఝా పేర్కొన్నారు.

