వందేభారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి భారతీయ రైల్వే శాఖ కీలక విషయం వెల్లడించింది. ఈ రైళ్లలో తత్కాల్ టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. సాధారణ రైళ్లలో చివరి నిమిషంలో ప్రయాణం చేసేందుకు ఉపయోగపడే తత్కాల్ కోటా వందేభారత్ స్లీపర్ రైళ్లకు వర్తించదు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ వ్యవధి లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ శివం శర్మ ఈ విషయాన్ని ధృవీకరించారు. వందేభారత్ స్లీపర్ రైళ్లలో తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం లేదని వెల్లడించారు. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను ముందుగానే నిర్ణయించుకుని టికెట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రత్యేకతలు
బీఈఎంఎల్ సంస్థ, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) సాంకేతిక సహకారంతో ఈ రైళ్లను రూపొందించింది. గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంది. మొత్తం 16 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో మూడు రకాల ఏసీ బెర్త్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఏసీ 3 టైర్: 11 కోచ్‌లు, 611 బెర్తులు
ఏసీ 2 టైర్: 4 కోచ్‌లు, 188 బెర్తులు
ఫస్ట్ ఏసీ: 1 కోచ్, 24 బెర్తులు
మొత్తంగా ఒక రైలులో 823 బెర్తులు అందుబాటులో ఉంటాయి.
వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టికెట్లు కూడా ఉండవు
వందేభారత్ స్లీపర్ రైళ్లలో కేవలం కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆర్ఏసీ (RAC), వెయిటింగ్ లిస్ట్, పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్లతో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. అలాగే ఈ రైళ్లలో డైనమిక్ లేదా ఫ్లెక్సీ ఫేర్ విధానం కూడా అమలులో ఉండదు. ప్రయాణికులకు టికెట్ ధరలు ముందుగానే నిర్ణయించిన విధంగా ఉంటాయి.
Also Read:దమ్ముంటే రా..రేవంత్‌కి ఎర్రబెల్లి సవాల్!
టికెట్ రద్దు చేస్తే ఎంత ఛార్జీ?
టికెట్ రద్దు విషయంలోనూ రైల్వే శాఖ ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది.
రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందుగా టికెట్ రద్దు చేస్తే 25 శాతం ఛార్జీ కట్ అవుతుంది.
72 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం ఛార్జీ మినహాయిస్తారు.
రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండదు.
అందువల్ల ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణ తేదీ, సమయం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రైల్వే నిబంధనలు సూచిస్తున్నాయి.

