రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని పేర్కొంది. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించింది.
Also Read:వందేభారత్ స్లీపర్ రైళ్లలో ‘తత్కాల్’ ఉండవు!
మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని తీవ్రత, కదలికలను బట్టి వర్షాల ప్రభావంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

