NCW:గృహహింస కేసులే అత్యధికం

3
- Advertisement -

జాతీయ మహిళా కమిషన్‌కు (NCW) ఏటా సుమారు 1.5 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయని కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ వెల్లడించారు. వీటిలో గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులే అత్యధికంగా ఉంటున్నాయని తెలిపారు.

పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు. మహిళలు తమ సమస్యలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకురావడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కమిషన్ ఆన్‌లైన్ పోర్టల్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS), ఈ-మెయిల్, నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడం, 24 గంటల పాటు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని వివరించారు.

“మాకు ఏటా సుమారు 1.5 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయి. కమిషన్ పరిధిలోకి వచ్చే కేసులను పరిశీలిస్తే.. గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులే అత్యధికంగా ఉంటున్నాయి” అని విజయ రహత్కర్ తెలిపారు.

ఫిర్యాదు ఎలా చేయాలో తెలియక ఏ మహిళా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించకుండా ఉండకూడదని ఆమె అన్నారు. మహిళల కోసం 14490 హెల్ప్‌లైన్ నంబర్‌తో పాటు వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉందని గుర్తుచేశారు.అలాగే ‘రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్’ అనే కార్యక్రమం ద్వారా వివిధ రాష్ట్రాల్లో ప్రజా విచారణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిషన్ కార్యాలయానికి నేరుగా రాలేని మహిళల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు.

Also Read:వందేభారత్ స్లీపర్ రైళ్లలో ‘తత్కాల్’ ఉండవు!

“మహిళలు మా దగ్గరకు రాలేకపోతే.. మేమే వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం” అని ఆమె పేర్కొన్నారు.దేశంలోని మహిళలు జాతీయ మహిళా కమిషన్‌ను తమ పుట్టింటిలా భావించాలని విజయ రహత్కర్ సూచించారు. ఇక్కడ ఎలాంటి భయం, సంకోచం అవసరం లేదని ఎలాంటి ఆందోళన లేకుండా మహిళలు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని ఆమె భరోసా ఇచ్చారు.

- Advertisement -