ఇవి ఎలక్షన్లా?..సెలెక్షన్లా?:జగన్

2
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని శకుని మాయ పాచికల్లా అధికార దుర్వినియోగంతో అపహాస్యం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాయా? లేక అధికార పార్టీకి అనుకూలంగా నిర్వహిస్తున్న సెలెక్షన్లా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

సూపర్ సిక్స్, మేనిఫెస్టో పేరుతో 143 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. సజావుగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయంతోనే దాడులు, రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ముఠా అరాచకాలకు పాల్పడుతోందని జగన్ ఆరోపించారు. 17 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ అభ్యర్థులను కనీసం నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ స్క్రూటినీ పేరుతో తిరస్కరించారని ఆరోపించారు. నామినేషన్ల దశలోనే ఏకంగా 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ లేకుండా చేశారని పేర్కొన్నారు.

కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. వీరంతా మాఫియా ముఠాలుగా ఏర్పడి ఎన్నికల వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకున్నారని విమర్శించారు.

Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర

ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవాల్సిన రిఫరీగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సైతం చంద్రబాబుకు పూర్తిగా తొత్తుగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే దేశంలో ఎన్నికల సంస్కరణలు ఎంత అవసరమో స్పష్టంగా అర్థమవుతోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

- Advertisement -