నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం రామాయణంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల లాస్ ఏంజెలెస్‌లో ఈ సినిమా గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్ నిర్వహించగా, ప్రస్తుతం చిత్రబృందం ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా నటుడు యశ్ తన కుమారుడు యథర్వ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాలో తాను రావణుడి పాత్ర పోషించడాన్ని తన కుమారుడు మొదట్లో అంగీకరించలేకపోయాడని తెలిపారు.
టీవీ యాంకర్ సుమ కనకాల యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. తన పిల్లలు తాతయ్య, నానమ్మల వద్ద రామాయణ కథలు వింటూ పెరిగారని చెప్పారు. సాధారణంగా పిల్లలకు తండ్రే హీరో అని, రామాయణ కథ తెలిసిన తన కుమారుడు సినిమాలో తాను రావణుడిగా నటిస్తున్నానని తెలిసి ఆశ్చర్యపోయాడని వెల్లడించారు.
‘మీరు రావణుడా? ఎలా అవుతారు? మీరు రాముడు కదా?’ అని తన కుమారుడు ప్రశ్నించాడని యశ్ చెప్పారు. అందుకు తాను నిజ జీవితంలో రాముడినేనని, సినిమాలో మాత్రం రావణుడి పాత్ర పోషిస్తున్నానని వివరించానన్నారు. అయినప్పటికీ తన కుమారుడు ‘అయితే సినిమాలో మీరు చెడ్డవారన్నమాట’ అని అన్నాడని గుర్తుచేసుకున్నారు. దీంతో సినిమా అంటే ఏమిటి? నటన అంటే ఏమిటి? అనే విషయాలను బొమ్మలు చూపిస్తూ తన కుమారుడికి వివరించాల్సి వచ్చిందని తెలిపారు.
సినిమా చూసేటప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలని కుమారుడు అడిగినప్పుడు తాను కొంత ఇబ్బందికి గురయ్యానని యశ్ చెప్పారు. అభిమానులకు కూడా ఇలాంటి సందేహం రావచ్చని, ముఖ్యంగా సీతాపహరణం వంటి సన్నివేశాల్లో రావణుడి పాత్రలో తనను ప్రేక్షకులు ఇష్టపడకపోవచ్చని అన్నారు. కథను విన్నప్పుడు ప్రతి ఒక్కరూ రాముడి మార్గాన్ని అనుసరించాలని, రావణుడు ఎంత అందంగా, శక్తిమంతంగా కనిపించినా చివరికి విజయం సాధించాలంటే శ్రీరాముడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలని కుమారుడికి చెప్పినట్లు వెల్లడించారు. అయితే సినిమాలో తన పాత్రకు అభిమానులు మద్దతు ఇవ్వొచ్చని, దాన్ని నిజ జీవితానికి అన్వయించుకోవద్దని వివరించానన్నారు.
Also Read:మంత్రి శ్రీధర్ బాబు vs ఎంపీ వంశీకృష్ణ
ఇక సినిమాలో తాను చనిపోతానా? ఓడిపోతానా? అని కూడా యథర్వ్ ప్రశ్నించాడట. తాను కేవలం ఓ పాత్రలో నటిస్తున్నానని, నిజ జీవితంలో తన వ్యక్తిత్వం వేరని కుమారుడికి చెప్పాల్సి వచ్చిందని యశ్ తెలిపారు. ఈ ప్రశ్నలు తనను అనూహ్యంగా ఇబ్బందికి గురిచేశాయని, సినిమా చేస్తున్న సమయంలో అభిమానుల స్పందన గురించి ఆలోచించానని, కానీ తన కుమారుడు ఇలా అడుగుతాడని ఊహించలేదని చెప్పారు. వయసు పెరిగే కొద్దీ నటనకు, నిజ జీవితానికి మధ్య ఉన్న తేడాను తన కుమారుడు అర్థం చేసుకుంటాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

