BB10:వర్షిణికి త్రిగుణ్‌ షాక్!

2
- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో స్నేహబంధాలు, నామినేషన్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. బయట ఆరేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్న త్రిగుణ్, వర్షిణి మధ్య నామినేషన్ చిచ్చు పెట్టింది. తన స్నేహితురాలినే త్రిగుణ్ నామినేట్ చేయడంతో వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది. ఆటలో స్నేహానికి తావు లేదని త్రిగుణ్ తన నిర్ణయంతో స్పష్టం చేశాడు.

వర్షిణి, త్రిగుణ్ బయట మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అయితే హౌస్‌లోకి వచ్చిన తర్వాత వర్షిణి ఎక్కువగా ముకేశ్‌తోనే కనిపిస్తోంది. మరోవైపు త్రిగుణ్ మాత్రం ఆటపైనే దృష్టి పెట్టాడు. తాజాగా నామినేషన్ సమయంలో వర్షిణిని ఎంపిక చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని వివరించాడు. ఆమె తనకు ఎంతో దగ్గరైన స్నేహితురాలని, అయినప్పటికీ తన ఆట గురించి కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.

నామినేషన్లకు ముందు ఇంట్లో స్వీట్ల పంపిణీ విషయంలో ముకేశ్, దేబ్జానీ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత శివ, ముకేశ్ మధ్య కూడా గొడవ చోటుచేసుకుంది. అనంతరం బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో త్రిగుణ్ రోహిత్‌ను నామినేట్ చేస్తూ అతడి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశాడు. తనను, వంశీని, రామకృష్ణను తక్కువగా అంచనా వేస్తున్నాడని మండిపడ్డాడు. స్టార్‌డమ్ వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలుసుకోవాలని సూచించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

దేబ్జానీ ఝాన్సీని నామినేట్ చేస్తూ ఆమె తన ఆటను కోల్పోతోందని అభిప్రాయపడింది. దీనిపై ఝాన్సీ తన బాధను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు త్రిగుణ్ వర్షిణిని నామినేట్ చేస్తూ, గతంలో జరిగిన ఓ సంఘటన తనను బాధించిందని చెప్పాడు. తనను అర్థం చేసుకుంటుందని భావించానని, కానీ తాను ఆశించిన మద్దతు లభించలేదని తెలిపాడు.

Also Read:ఆ ట్రిక్‌ను మిస్ అయ్యారు!

దీనికి వర్షిణి స్పందిస్తూ, త్రిగుణ్ తనకు ఎంతో దగ్గరని, ఏ సమస్య వచ్చినా అతడు అండగా ఉంటాడనే నమ్మకం తనకు ఉందని చెప్పింది. అయితే తనపై ఇతరుల కోపాన్ని చూపిస్తున్నాడని భావిస్తున్నట్లు పేర్కొంది. త్రిగుణ్ నిర్ణయంతో భావోద్వేగానికి గురైన వర్షిణి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ నామినేషన్ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. స్నేహాన్ని పక్కనపెట్టి త్రిగుణ్ తీసుకున్న నిర్ణయం గేమ్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

- Advertisement -