ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) పూర్’ కేటగిరీలోకి చేరడంతో ఉదయం వాకింగ్, జాగింగ్, బయట వ్యాయామాలు చేసే వారు తమ దినచర్యను మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కలుషిత గాలిని పీల్చడం వల్ల దగ్గు, గొంతు మంట, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారితో పాటు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కాలుష్యానికి పదేపదే గురైతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
గాలిలో ఉండే అతి సూక్ష్మమైన ధూళి కణాలు ముఖ్యంగా PM2.5 ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకెళ్లగలవు. కొన్ని కాలుష్య కారకాలు శరీరంలో వాపును కలిగించడంతో పాటు గుండె, రక్తనాళాల వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీఎల్కే-మ్యాక్స్ ఆసుపత్రి సెంటర్ ఫర్ చెస్ట్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ రోషన్ కీలక సూచనలు చేశారు. గాలి నాణ్యత తగ్గినప్పుడు కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించాలని, ముఖ్యంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బయటకు వెళ్లే ముందు ఏక్యూఐ స్థాయులను పరిశీలించాలని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం, జాగింగ్, బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామాలు చేయడం తగ్గించాలి. ముఖ్యంగా రద్దీగా ఉండే రహదారులు, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వ్యాయామం చేయకపోవడం మంచిది.
ఉదయం వేళల్లో కాలుష్య స్థాయులు ఎక్కువగా ఉండే సందర్భాల్లో మార్నింగ్ వాక్కు వెళ్లకుండా ఉండాలని, వీలైతే వ్యాయామ సమయాన్ని మార్చుకోవాలని లేదా ఇంట్లోనే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అయితే కాలుష్య స్థాయులు రోజువారీగా, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి కాబట్టి బయటకు వెళ్లే ముందు స్థానిక ఏక్యూఐ వివరాలను పరిశీలించడం అవసరం.
వాయు కాలుష్యాన్ని కేవలం కొన్ని నెలల పాటు ఉండే సాధారణ సమస్యగా భావించకూడదని డాక్టర్ రాహుల్ రోషన్ తెలిపారు. సూక్ష్మ ధూళి కణాలు శ్వాసనాళాలను చికాకుకు గురిచేయడంతో పాటు ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల సమస్యలను తీవ్రతరం చేయవచ్చని వివరించారు. పదేపదే కాలుష్యానికి గురైతే ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ దగ్గు, గొంతు మంట, పిల్లికూతలు, ఆయాసం వంటి లక్షణాలు కనిపించవచ్చన్నారు.
Also Read:తెలంగాణకు అమిత్ షా..డేట్ ఫిక్స్
పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), గుండె జబ్బులతో బాధపడుతున్నవారు కాలుష్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు వారి ఊపిరితిత్తులు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటంతో కాలుష్యం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు, ఇప్పటికే ఉన్న అనారోగ్య పరిస్థితుల కారణంగా కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు.
కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో బయట గాలికి గురికావడాన్ని తగ్గించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం, ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ రాహుల్ రోషన్ తెలిపారు.

